27 Feb 2012

సీవీ రామన్.. నోబెల్ ప్రైజ్


  • 27/02/2012
రామన్ అనగానే అందరికీ నోబెల్ బహుమతి జ్ఞాపకం వస్తుంది. కానీ, ఆ బహుమతితో అసంతృప్తికి గురయినవారు కూడా ఉన్నారన్న విషయం చాలామందికి తెలియదు. 1913 నుంచీ రష్యాలో లాండ్ స్ట్రామ్, లాండ్స్ బెర్గ్ అనే ఇద్దరు పరిశోధకులు, రామన్ జరుపుతున్న రకం పరిశోధనలు సాగించారు. 1925లో వారి పరిశోధన క్వార్ట్జ్ అనే పదార్థంతో కొనసాగింది. రష్యాలో క్వార్ట్జ్ కావలసినంత దొరుకుతుంది. కానీ వ్యాపారులు ఈ పరిశోధకులను మోసపుచ్చి చవకబారు సరుకును అంటగట్టారు. వారికి 1928లో గానీ మంచి క్వార్ట్జ్, మంచి ఫలితాలు అందలేదు. అప్పుడుగానీ వారికి రామన్‌కు వచ్చిన లాంటి ఫలితాలు రాలేదు! వచ్చిన తర్వాత కూడా నమ్మకం కుదరక వారు తమ ఫలితాలను ప్రచురించలేదు. రామన్ తన పరిశీలనలు ప్రచురించిన తర్వాత అందరికీ, రష్యన్‌ల పరిశోధన గురించి అర్థమయింది. వాళ్లు తమ పరిశోధన ఫలితాలను ప్రచురించేలోగా విషయం మీద 16పత్రాలు వచ్చేశాయి. రామన్ ఐఫెక్ట్ పుట్టేసింది! తరువాత కూడా రష్యనులు దాన్ని రామన్ స్కాటరింగ్ అనలేదు. కానీ, కాలక్రమంలో వారికి కనువిప్పు కలిగింది. సైన్సు పద్ధతిలో సంగతిని చర్చకు పెట్టి అవుననుపించడం ముఖ్యమయిన భాగం!
1928లోనే రామన్‌కు నోబెల్ వస్తుందనుకున్నారు కానీ రాలేదు. 1929లో కూడా రాలేదు. 1930లో రామన్, తనకూ, భార్యకూ యూరపు వెళ్ళడానికని టికెట్లు కొన్నారు. ఆ తర్వాత నోబెల్ బహుమతి ప్రకటించబడింది. 1930 డిసెంబరు పదవ తేదీన స్టాక్‌హోమ్‌లో బహుమతి ప్రదానం జరిగింది. ఆ సందర్భంగా అమెరికా ప్రతినిధిగా వచ్చిన అధికారి రాసిన మాటలు అందరూ చదవదగినవి.
‘‘నోబెల్ బహుమతి గ్రహీతలందరికీ, భారతీయ విజేత, సర్ వెంకట్రామన్‌గారి మీద అందరి దృష్టి కేంద్రీకరింపబడింది. రాజుగారి చేతుల మీదుగా బహుమతి అందుకున్న తర్వాత ఆయన భావోద్వేగానికి గురవుతూ తమ స్థానానికి తిరిగి వచ్చారు. అతని కళ్లనుండి బాష్పాలు స్రవించాయి. తరువాత డిన్నర్ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం ఒక మాస్టర్ పీస్. హాలులోని అందరూ ప్రసంగం తర్వాత గొప్పగా అప్లాస్ తెలియజేశారు’’ అని అధికారి తమ దేశానికి వర్తమానం పంపారు.
‘నా సీటుకువచ్చిన తరువాత నాకు చుట్టూ, తెల్లవారి ముఖాలు మాత్రమే కనిపించాయి. వారి మధ్యలో ఒంటరిగా, నేను, కోటు, తలపాగాలతో, ఒక భారీయుడిని మిగిలాను. నా దేశం, నా ప్రజల ప్రతినిధిగా నేనున్నాననిపించింది. మహారాజుగారి నుంచి బహుమతి అందుకునే సమయాన నేను నమ్రభావానికి గురయ్యాను. నన్ను నేను తమాయించుకున్నాను. పైన చూస్తే, నా వెనుక బ్రిటీష్ జెండా కనిపించింది. దేశం పరిస్థితి మనసులో మెదిలింది. మనకొకజెండా కూడా లేదు! నా ఉద్వేగం దాంతో కట్టలు తెగింది’ అని రాసుకున్నారు రామన్!

No comments: