7 Feb 2012

సస్యరక్షణ మందులు.. అవశేషాలు.. ప్రభావాలు..

సస్యరక్షణ మందులు.. అవశేషాలు.. ప్రభావాలు..

వ్యవసాయోత్పత్తిలో సస్యరక్షణ మందుల వాడకం అనివార్యం చేయబడింది. వీటి వాడకాన్ని పూర్తిగా తగ్గించగల ప్రత్యామ్నాయాలు రైతులకు చేరడం లేదు. వీటి ఆచరణలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఈ మందుల వాడకాన్ని కనీసస్థాయికి తగ్గించగల సమగ్ర సస్యరక్షణ పద్ధతులు రైతుల ఆచరణకు నోచుకోవడం లేదు. మందుల తయారీ కంపెనీల పరోక్ష, ప్రత్యక్ష ప్రభావం, సంబంధిత ప్రభుత్వ యంత్రాంగ నిర్లక్ష్యం సమగ్ర సస్యరక్షణకు నోచుకోక విచక్షణా రహిత మందుల వినియోగానికి దోహదపడుతుంది. ఇది ఉత్పత్తుల్లో అవశేషాలను హాని కలిగించే కనిష్ట స్థాయిని మించుతోంది. మందుల వాడకం, ఆ తర్వాత అధికంగా ఉన్న అవశేషాలు ఆరోగ్య సమస్యల్ని సృష్టిస్తున్నాయి. మందుల వాడకాన్ని తగ్గించడానికే ప్రవేశపెట్టామని చెపుతున్న బిటి పంటలు (బిటి విషాహార పంటలు) కూడా పర్యావరణ, ఆరోగ్య సమస్యలను సృష్టిస్తున్నాయి. మందుల వాడకాన్ని ప్రచారం చేసినట్లుగా తగ్గించలేదు. ఈ నేపథ్యంలో, సస్యరక్షణ మందుల వాడకంలో ఉన్న ఇబ్బందుల్ని, ప్రభావాల్ని ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, సుస్థిర వ్యవసాయోత్పత్తి కేంద్రం సహకారంతో రేఖామాత్రంగా విశ్లేషిస్తూ.. ఈవారం 'విజ్ఞాన వీచిక' మీముందుకొచ్చింది.
మన వ్యవసాయంలో 200కు పైగా మందులు వాడుతున్నారు. వీటిలో దాదాపు 75 శాతం సస్యరక్షణకు సంబంధించినవి. కలుపు యాజమాన్యానికి సంబంధించి 12 శాతం మందుల్ని వాడుతున్నాం. ప్రపంచ వ్యవసాయంలో సస్యరక్షణకు 32 శాతం, కలుపు నియంత్రణకు 47 శాతం మందుల్ని వాడుతున్నారు.
మన దేశంలో వాడే సస్యరక్షణ మందుల్లో 50 శాతం మందులు ఆర్గెనో ఫాస్ఫేట్‌ సంతతికి చెందినవి. కార్బామేట్స్‌, సింథటిక్‌ పైరిథ్రాయిడ్స్‌ సంతతికి చెందిన మందులు 45 శాతం మేర వాడుతున్నాం. ఇక జీవ సస్యరక్షణ (బయో ఫెస్టిసైడ్స్‌) మందులను కేవలం ఒక శాతం మాత్రమే వాడుతున్నాం. ఇవి మిగతావాటికన్నా శ్రేష్ఠమైనవి. ప్రపంచస్థాయిలో సగటున 12 శాతం మేర వీటిని వాడుతున్నారు.
కూరగాయలు, పండ్లు, పాల ఉత్పత్తుల్లో మందుల అవశేషాలు అధికంగా ఉంటున్నాయి. భారత వ్యవసాయ మంత్రిత్వశాఖ ప్రకారం దీనికి కారణాలు...
* విచక్షణా రహిత మందుల వాడకం.
* మందులు వాడిన తర్వాత కనీస నిరీక్షణ కాలాన్ని పాటించకపోవడం.
* నాణ్యతలేని మందుల వాడకం.
* మందుల వ్యాపారస్తులు వాడకంలో రైతులకు తప్పుడు సలహాలను ఇస్తుండడం.
* ప్రజారోగ్య కార్యక్రమాల్లో డిడిటి లాంటి మందుల వాడకాన్ని కొనసాగిస్తుండడం.
*ష సస్యరక్షణ మందుల తయారీ కంపెనీలు వదిలే వ్యర్థ పదార్థాలు.
* మిగిలిన సస్యరక్షణ మందుల్ని పారేయకూడని విధంగా పారేయడం.
* వాడిన స్ప్రేయర్లను, మందు పాత్రలను కడిగిన నీటిని పారబోసే విధానం.
* అమ్మే ముందు ఉత్పత్తుల నిల్వలో సస్యరక్షణ మందుల వినియోగం.
* పండ్లు, కూరగాయలను సస్యరక్షణ మందులతో శుద్ధి చేయడం.
శరీరంలోకి ప్రవేశించే తీరు...
సస్యరక్షణ మందుల్ని వాడేటప్పుడు నోటి ద్వారా, చర్మం లేదా ముక్కు ద్వారా శరీరం లోకి ప్రవేశిస్తాయి. రక్షణ కోసం ఏ కవచం లేకుండా మందు డబ్బాల్ని, చల్లే పరికరాల్ని పట్టుకుని అదే చేతులతో తినడం, తాగడం వల్ల కూడా మందు లు శరీరంలోకి ప్రవేశిస్తాయి. మందు చల్లిన తర్వాత కలుషిత గాలిని పీల్చడం వల్ల కూడా మందు శరీరంలోకి ప్రవేశిస్తుంది. కొంతమంది రైతులు రసాయనాలను ఇంట్లోనే పెడుతున్నారు. తద్వారా గాలి కలుషిత మవుతుంది. వీటి ద్వారా శరీరంలోకి మందులు ప్రవేశిస్తున్నాయి.
దుష్ప్రభావాలు...
* తక్షణం లేదా కొంతకాలం తర్వాత ఇవి బయటపడవచ్చు.
* మరణించే మోతాదులో మందు శరీరంలోకి ప్రవేశిస్తే తక్షణ మార్పులు జరుగుతాయి.
* విపరీతమైన తలనొప్పి, కళ్లు తిరగడం, పూర్తిగా బలహీనపడటం, నిర్విరామంగా అవయవ కదలిక, చెమట పట్టడం, చొంగ కార్చడం, వాంతి రావడం, మల, మూత్ర విసర్జన వంటివి జరుగుతాయి.
* ఆకలి చచ్చిపోతుంది. నోరు ఎండి దాహం అధికమవుతుంది.
* కీళ్ళ నొప్పులు, చర్మం దురదపెట్టడం, కళ్లు, ముక్కు మండుతాయి.
* గ్రామీణ ప్రాంతాల్లో, అత్యధికంగా మందుల్ని వాడే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో దీర్ఘకాల అనారోగ్యాలు కలుగుతున్నాయి. వీటి బారిన పడినవారికి రకరకాలైన క్యాన్సర్స్‌ (లుకేమియా, మెదడు క్యాన్సర్‌, సాఫ్ట్‌ టిష్యూ, సర్కోమా) వంటివి గమనించబడ్డాయి. వీరికి పుట్టే పిల్లల్లో కూడా దీర్ఘకాల వ్యాధిలక్షణాలు (బొమ్మలో చూడండి) కూడా ఏర్పడతాయి.
* వీటివల్ల పునరుత్పత్తి అంగాలపై వచ్చే వత్తిడి, నాడీ మండల సమన్వయంలో వచ్చే మార్పులు, వ్యాధి నిరోధకశక్తి తగ్గిపోవడం వంటి దుష్ప్రభావాలు కనిపిస్తాయి.
* మతిస్థిమితం కోల్పోవడం, మతిమరుపు పెరగడం, వివిధ రకాల ఆహారాలకు, పానీయాలకు అలర్జీ కలగడం.
* ఆస్త్మా, బ్రాంకైటిస్‌ లాంటి జబ్బులు రావడం సేద్య రైతుల్లో గమనిస్తున్నాం.
శిలీంధ్ర నాశనం వల్ల కలుగుతున్న
ఆరోగ్య సమస్యలు...
కూరగాయలు, పండ్ల పైర్లపై అతిగా వాడుతున్న గంథకం (సల్ఫర్‌), రాగి, భాస్వరం, పాదరసం ఆధారిత మందులు అనారోగ్యాన్ని సృష్టిస్తున్నాయి. సల్ఫర్‌ పలు సందర్భాల్లో తలనొప్పి, వాంతులు, స్పృహ కోల్పోయేలా చేస్తుంది. సల్ఫర్‌ డై ఆక్సైడ్‌ వాయువు వల్ల కళ్లు మంటలు, శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తాయి. రాగి (కాపర్‌ ఆక్సిక్‌ క్లోరైడ్‌) ఆధారిత మందుల వల్ల చర్మవ్యాధులు, శ్వాసకోశ సంబంధ వ్యాధులు పెరుగుతున్నట్లు గమనించబడింది. థిరమ్‌, కాప్టోపాల్‌ వంటి మందులు అలర్జీని కలిగిస్తాయి. అంతర్వాహిక (సిస్టమిక్‌) మందులైన కార్బండాజిమ్‌, థయోఫాస్ఫేట్‌, మిథైల్‌, కార్బాక్సిన్‌, ఆక్సి కార్బాక్సిన్‌ వంటివి ఆరోగ్యానికి నష్టం కలిగించేవిగా గుర్తించబడ్డాయి. పిల్లల్లో వీటి ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
కొన్ని ఎగుమతుల్లో గుర్తించిన మందుల కాలుష్యం...
కారం / మిరప: సూడాన్‌ రెడ్‌, సైపర్‌మెత్రిన్‌, ఇథియాన్‌, క్లోరోఫైరిఫాస్‌. ఘాటు ఎక్కువగాగల మిరప / కారంలో అఫ్లోటాక్సెన్‌. కూరకారం (కర్రీ కారం) లో సాల్మొనెల్లా, సైపర్‌మెథ్రిన్‌, ఫెన్‌వలరేట్‌, ఫాస్ఫోమిడాన్‌.
ధనియాలు : ఎలుక మలం.
ద్రాక్ష : మిథోమిల్‌, ఎసిఫేట్‌, టైజోఫాస్‌.
మీకు తెలుసా..?
* సస్యరక్షణ మందుల వాడకం క్రమంగా తగ్గుతోందని రాష్ట్ర గణాంకాలు తెలుపుతు న్నాయి. 2001-02లో 3,850 టన్నుల చురుకైన మందు (యాక్టివ్‌ ఇన్‌గ్రేడియెంట్‌) వాడగా, 2005-06లో ఇది 1,918 టన్నులకు, 2009-10లో 1,015 టన్నులకు తగ్గిపోయింది.
* కొత్తగా వస్తున్న మందులు శక్తివంతమై నవి. వాడాల్సిన మోతాదూ తక్కువే. కానీ వీటి ఖరీదు పాత మందుల కన్నా చాలా ఎక్కువ. అయితే ఎకరానికి వాడాల్సిన కొత్త మందుల ఖరీదు పాత మందు ఖరీదు కన్నా కొద్దిగా ఎక్కువ.
* దేశంలో మోనోక్రోటోఫాస్‌, ఎండో సల్ఫాన్‌, ఫోరేట్‌, క్లోరోఫైరిఫాస్‌, మిథైల్‌ పెరాథియాన్‌, క్వినాల్‌ ఫాస్‌, మాంకోజెబ్‌, పారాక్వాట్‌, బ్యూటాక్లోర్‌, ఐసోప్రొటో యూరాన్‌, ఫాస్ఫోమిడాన్‌ మందులు అధికంగా వాడుతున్నారు.
* పరిమాణంలో ఆర్గానోక్లోరిన్‌ మందులు 45 శాతం, ఆర్గానోఫాస్ఫేట్స్‌ 35 శాతం, కార్బామేట్స్‌ 15 శాతం, సింథటిక్‌ పైరిథ్రాయిడ్స్‌ 10 శాతం, ఇతర మందులు 5 శాతం వాడుతున్నారు. విలువలో ఆర్గానో ఫాస్ఫేట్స్‌ 50 శాతం, సింథటిక్‌ ఫైరిథ్రా యిడ్స్‌ 19 శాతం, ఆర్గానో క్లోరైడ్స్‌ 16 శాతం, కార్బామేట్స్‌ నాలుగు శాతం, జీవ సస్యరక్షణ (బయో ఫెస్టిసైడ్‌) మందులు ఒక శాతం వాడబడుతున్నాయి.
* మిరపలో సస్యరక్షణ మందుల గరిష్ట అవశేషాల పరిమితి (పిపిఎంలలో) కార్బరిల్‌ 5, డైకోఫాల్‌, ఎండోసల్ఫాన్‌, మాంకోజెబ్‌ 1, డైమిథోయేట్‌ 0.5, క్వినాల్‌ఫాస్‌, థయో ఫాస్ఫో మిథైల్‌, మోనోక్రోటోఫాస్‌ 0.2, ఇనార్గానిక్‌ బ్రోమైడ్‌ 400.
* మిరపలో 15 రకాల మందుల వినియో గాన్ని సూచిస్తున్నప్పటికీ తొమ్మిదింటికే గరిష్ట అవశేషాల పరిమితి నిర్ణయించబడ్డాయి.
* ఎన్నో కొత్త మందుల్ని కనీసం రిజిష్టర్‌ కూడా చేయకుండానే రైతులకు చేరుతు న్నాయి. వీటికి గరిష్ట అవశేషాల పరిమితిని కూడా నిర్ధారించటం లేదు.
అవశేషాలు..
సస్యరక్షణ మందుల అవశేషాలు సురక్షిత స్థాయిలో ఉండాలంటే కింది జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సూచిస్తోంది.
*‌ సస్యరక్షణ మందులు పిచికారి చేసిన తర్వాత పంటను కోయటానికి కొంత సమయం వేచి ఉంటే అవశేషాలు నిర్ధారించిన పరిమితులకు మించవు.
*‌ సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించి, సిఫారసు చేయబడిన మందులను అవసరాన్ని బట్టి మాత్రమే వాడాలి.
*‌ ఎరుపు రంగు త్రిభుజం ఉన్న (ఉదా: మిథోమిల్‌, మోనోక్రోటోఫాస్‌) సస్యరక్షణ మందులను వాడరాదు.
*‌ తక్కువ కాలంలో విష ప్రభావం కోల్పోయే కొత్త రకాల సస్యరక్షణ మందులు మరియు బయోఫెస్టిసైడ్స్‌ వాడాలి.
*‌ నిర్ధారించిన మోతాదుల్లో సరైన స్ప్రేయర్‌ను ఉపయోగించి నిర్ధారించిన సమయాల్లో మాత్రమే పిచికారి చేయాలి.
*‌ పంటను కోయటానికి ముందు సాధ్యమైనంత వరకు సస్యరక్షణ మందులను పిచికారి చేయరాదు.
*‌ పురుగు మందుల చట్టం ప్రకారం భారత ప్రభుత్వం కూరగాయల్లో మోనోక్రోటోఫాస్‌ వాడకాన్ని పూర్తిగా నిషేధించింది.
*‌ ఇంటిలో కూరగాయలను మరియు పండ్లను రెండు శాతం ఉప్పు ద్రావణంలో 15-20 నిమిషాలుంచి కడిగినట్లయితే అవశేషాలు చాలా వరకు తొలగిపోతాయి. కూరగాయల్ని ప్రెషర్‌కుక్కర్‌లో ఉడికించినట్లయితే కొన్ని అవశేషాలు పూర్తిగా తొలగిపోతాయి.
తొలగించే పద్ధతి....
రెండు శాతం ఉప్పు ద్రావణంతో కడిగితే పైపైన ఉండే మందుల అవశేషాలు గణనీయంగా తొలగిపోతాయి. క్యాబేజీపై మూడు ఆకుల్ని తీసివేస్తే మందుల ప్రభావం పోతుంది. రెండు శాతం ఉప్పు ద్రావణంలో కడిగి, ఆ తర్వాత 15 నిమి షాలు ఉడికిస్తే మందుల అవశేషాలు గణనీయంగా తగ్గుతాయి. చేపలు, మాంసాన్ని ఒక శాతం ఎసిటిక్‌ ఆమ్లంలో 10 నిమిషాలు ఉంచి, తర్వాత మామూలు నీటితో కడిగితే అన్ని రకాల మందులు 30-50 శాతం వరకు తొలగిపోతాయి.
వేచి ఉండేకాలం..
కార్బరిల్‌, డెల్టా మెథ్రిన్‌ స్ప్రే చేసిన రెండు రోజుల తర్వాత టమాటా, వంగ, బెండని కోయాలి. మూడు, నాలుగు రోజుల తర్వాత క్యాబేజిని కోయవచ్చు. మిరప, క్యాలిఫ్లవర్‌ను ఐదు రోజుల తర్వాత మాత్రమే కోయాలి.
మలాథియాన్‌ స్ప్రే చేసిన రెండు రోజుల తర్వాత బెండ, వంగను, నాలుగు రోజుల తర్వాత టమాటను, ఐదు రోజుల తర్వాత క్యాబేజి, క్యాలిఫ్లవర్‌ను కోయాలి.
సూపర్‌ మెథ్రిన్‌ స్ప్రే చేసిన ఐదు రోజుల తర్వాతనే వంగ, టమాటాలను కోయాలి. ఏడు రోజుల తర్వాత మిరప, బెండ, క్యాబేజీని, 10 రోజుల తర్వాత క్యాలిఫ్లవర్‌ను కోయాలి.
క్వినాల్‌ఫాస్‌ స్ప్రే చేసిన ఐదు రోజుల తర్వాత మాత్రమే టమాటా, క్యాబేజీను కోయాలి. ఏడు రోజుల తర్వాత మిరపను, 15 రోజుల తర్వాత బెండను కోయవచ్చు.
ఫెన్‌వలరేట్‌ స్ప్రే చేసిన ఏడు రోజుల తర్వాత బెండ, వంగను, 10 రోజుల తర్వాత టమాటా, కాబేజీని కోయాలి.
డైమిథోయేట్‌ స్ప్రే చేసిన ఐదు రోజుల తర్వాత క్యాలిఫ్లవర్‌ను, ఆరు రోజుల తర్వాత మిరపను, ఏడు రోజుల తర్వాత వంగను కోయాలి.
మోనోక్రోటోఫాస్‌ స్ప్రే చేసిన 23 రోజుల తర్వాత మాత్రమే మిరప, బెండను కోయాలి.
ద్రాక్ష: దీనిపై కార్బరిల్‌, డైథేన్‌ ఎం-45, డై క్లోర్‌వాస్‌ స్ప్రే చేసిన ఐదు రోజుల తర్వాత మాత్రమే కోయాలి. ఇదే పైరుపై ఫస్‌లోన్‌, డైమిథోయేట, ఫెన్‌వల రేట్‌ను స్ప్రే చేసిన ఆరు రోజుల తర్వాత కోయాలి. కార్బండాజిమ్‌ స్ప్రే చేసిన ఒక రోజు తర్వాత ద్రాక్షను కోయవచ్చు. ఎసిఫేట్‌, రిడోమిల్‌ స్ప్రే చేసిన 10 రోజుల తర్వాత మాత్రమే ద్రాక్షను కోయాలి. క్వినాల్‌ఫాస్‌ స్ప్రే చేసిన 18 రోజుల తర్వాత, క్లోరిఫైరిఫాస్‌ స్ప్రే తర్వాత 25 రోజులకు ద్రాక్షను కోయవచ్చు.
మామిడి: దీనిపై డెల్లామెథ్రిన్‌ స్ప్రే చేసిన మూడు రోజుల తర్వాత కాయల్ని కోయవచ్చు. కార్బరిల్‌ స్ప్రేచేసిన ఏడు రోజుల తర్వాత, సైపర్‌ మెథ్రిన్‌ తొమ్మిది రోజుల తర్వాత, ఫెన్‌వలయేట్‌ 10 రోజుల తర్వాత, క్వినాల్‌ఫాస్‌ 15 రోజుల తర్వాత మామిడి కాయల్ని కోయవచ్చు.
గమనిక: ఈ పేజీపై మీ స్పందనలను 9490098903కి ఫోను చేసి తెలియజేయండి.

No comments: