7 Feb 2012

వికృతినామ సంవత్సర పంచాంగ ఫలితాల సమీక్ష!

వికృతినామ సంవత్సర పంచాంగ ఫలితాల సమీక్ష!

  • విశ్వాసాలు.. వాస్తవాలు...
'ఖర నామ' సంవత్సరం ఏప్రిల్‌ నాలుగు నుండి ప్రారంభమవుతోంది. పంచాంగ శ్రవణంలో జ్యోతిష్యులు ఈ సంవత్సర ఫలితాలు చెప్పబోతున్నారు. ఈ సందర్భంగా వికృతినామ సంవత్సరం (2010-11)లో జ్యోతిష్యులేం చెప్పారు? అవి ఎంతవరకు జరిగాయి? సమీక్ష చేసుకోవడం అవసరం.
ముందుగా వాతావరణ జోస్యాన్ని పరిశీలిద్దాం. అవి ఎంత పరస్పర విరుద్ధంగా ఉన్నాయో తెలుసుకుందాం.
1. నేమాని సిద్ధాంతి 'జ్యేష్ఠశుద్ధ పాడ్యమి ఆదివారమగుట వలన 'దుర్భిక్షం' అని జోస్యం చెప్పారు. కాని, గార్గేయ వారు జ్యేష్ఠ మాసంలో ప్రకృతి వైపరీత్యాలు అధికమై, కొన్ని ప్రాంతాలలో సస్యానుకూలంగా వర్షించును' అన్నారు.
2. ఆషాఢంలో ప్రచండ వాయువులు వీస్తాయని తంగిరాలవారు సెలవిస్తే.. మంచివర్షాలు, పంటలు పండుతాయని నేమానివారు ప్రకటించారు.
3. ప్రమాద సూచికలు ఎగురవేసేటంతటి వానలు ఆషాఢం, ఆశ్వయిజం మధ్యలో పడతాయని బట్టే వీరభద్ర సిద్ధాంతి తెలియజేశారు. కొన్ని ప్రాంతాలలో ఆషాఢంలో వాతావరణం చల్లబడటాన్ని మాత్రమే శ్రీనివాసగార్గేయ సూచించారు.
4. ఆంధ్రజ్యోతి పంచాంగకర్త: శ్రావణభాద్రపద మాసాల్లో వర్షాభావం వల్ల పంట నష్టం జరుగుతుందన్నారు. శ్రావణంలో చక్కని వర్షం ఉండగలదనీ, భాద్రపదంలో భారీవర్షాలనీ శ్రీనివాసగార్గేయ జోస్యం చెప్పారు.
ఇలా వాతావరణం, వర్షాలకు సంబంధించి ఎవరి జోస్యం వారిదే కావడం గమనించదగ్గ విషయం!
ఇక కొందరు పంచాంగకర్తలు వాస్తవ విరుద్ధంగా చెప్పిన జ్యోతిష్యాలను పరిశీలిద్దాం..
శ్రీనివాసగార్గేయ : జోస్యం 1: బంగ్లాదేశ్‌, ఇరాన్‌, భారత్‌లో కారు బాంబులు అధికమగును.
వాస్తవం: ఈ దేశాలలో అసలు కారు బాంబే పేలలేదు.
జోస్యం 2: నేపాల్‌లో మావోయిస్టుల మారణకాండ శృతిమించును.
వాస్తవం: నేపాల్‌లో ఈ సంవత్సరం మావోయిస్టుల హింసాకాండ ఏమీలేదు.
ములుగు రామలింగేశ్వర వరప్రసాదు జోస్యాలు; వాస్తవాలు:
జోస్యం 1: చైనా ప్రధానశతృదేశం అవుతుంది.
వాస్తవం: చైనాతో శతృత్వచర్యలు ఏమీ జరగలేదు. చైనాను శతృదేశంగా చేసే కుట్రలో ఇది భాగమా?
జోస్యం 2: రాహుల్‌ ద్రావిడ్‌ ఆడడు. సహచరులను ఆడనివవ్వడు. టీముకు బరువు.
వాస్తవం: రాహుల్‌ ద్రావిడ్‌ 2010 డిసెంబరు 10 నాటికి 200 క్యాచ్‌లు పట్టి ప్రపంచ రికార్డు స్థాపించాడు. 2010లో న్యూజిలాండ్‌ మాచ్‌లో 191 పరుగులు చేసి 'మాన్‌ ఆఫ్‌ ది మాచ్‌' అయ్యాడు.
జోస్యం 3: సచిన్‌, సెహ్వాగ్‌లతో బాటు ఆర్‌.పి.సింగ్‌ రాణిస్తాడు.
వాస్తవం: ఆర్‌.పి.సింగ్‌ 2010లో అంతర్జాతీయ మాచ్‌ లే ఆడలేకపోయాడు. ఏవో కొన్ని పేర్లు చెప్పడమే జోస్యమా?
జోస్యం 4: న్యూజిలాండ్‌కు ప్రతికూల కాలం; పరిసర ప్రాంతాలలోని దీవులకు యమగండకాలం; ఇండోనేసియా, సుమిత్రా దీవులకు ప్రకృతి వైపరీత్యాల ముప్పు; ఫిలిప్పీన్స్‌ దేశానికి అరిష్టకాలం;
వాస్తవం : ఈ దేశాలలో తీవ్ర పరిణామాలు ఏమీ సంభవించలేదు. జపాన్‌ను గూర్చి ఒక్క ముక్కా చెప్పలేదు.
జోస్యం 5: ప్రత్యేక తెలంగాణా అనివార్యం.
వాస్తవం అందరికీ తెలుసు. ఇలా పరస్పర విరుద్ధ విషయాలు, వాస్తవ విరుద్ధ జోస్యాలతో పంచాంగాలు నింపబడ్డాయి. వచ్చే ఏటి పంచాంగ శ్రవణం ముందు, గత సంవత్సర పంచాంగ ఫలితాలను సమీక్ష చేసుకుంటే పంచాంగాలు ఎలాంటి కబుర్లో అర్థం అవుతాయి.
కె.ఎల్‌.కాంతారావు,జన విజ్ఞాన వేదిక.

No comments: